Sunday, August 22, 2010

మంచి ముత్యం 2

కాళ్ళు ఎప్పుడూ నేల మీదే ఉండాలి
కళ్ళు ఎప్పుడూ వాటినే చూడాలి
జయం వహిస్తే తొనకరాదు
అపజయం ఆవహిస్తే వనకరాదు
అవి అసాస్వతం
నువు ఎంత వాడివైననూ
అణిగి ఉంటె నిన్ను అనిచేవాడెవడు?

మంచి ముత్యం

కుమ్మరి చేతికి చిక్కాల్సిన మట్టి ముద్ద
చాకలి చేతికి చిక్కితే వట్టి బురదే
అవును గాని మట్టి పిడతగా మారునా?
కంసాలికివ్వాల్సిన రత్నాన్ని పిచ్చివాడికిస్తే
అది గులకరాయిగా దోర్లునుగాని
వజ్రమై పుత్తడి పొత్తిలో పొదిగి ఉండునా?
మరి నువు ఎవరి చేతికి చిక్కావ్?

ఇటు మూడు - అటు ఆరు

మనదనుకున్న మనది మనతో వచ్చునా?
వలదనుకున్నది వచ్చి తీసుకుపొవటం మరచునా?
మనది కాదనుకున్న మన్నేగా  చివరికి మనమయ్యేది!
మరి ఎందుకు ఈ జీవన గమనంలో స్వార్ధ ప్రయాసలకై జపించటం?
క్షణకాలంలో క్షయించే ఉదానమును అవి పెంచగలవా
లేక సమీపించే తుది గడియలను మన నుంచి తుంచగలవా
ఎవరికైనా చివరకు మిగిలేది
......"ఇటు మూడు - అటు ఆరే కదా!" 

ఇష్టం

నా ఇష్టాన్ని
తన ఇష్టానికి
కష్టమైనా
ఇష్టంగా నష్టపోయి
తన ఇష్టాన్ని
స్పష్టంగా ఇష్టపడి
బ్రతకడంలొ ఉండే
మధుర భావమంటే
నాకెంతో ఇష్టం.

Friday, August 13, 2010

దూరం

దూరమన్న మాట దూరాన ఉన్నపుడు
దానికి నేనెంతో దూరమని భావించాను
కానీ నువు కాస్త దూరానికి దగ్గర కాగానే
ఆ దూరం కాస్త నాకు దగ్గరయ్యి
నీ స్నేహాన్ని ఇంకా దగ్గర చేసింది.
దూరానికి దగ్గరైతే అది ఎన్నో
దూరాలను దగ్గరకు చేర్చుతుందని
నువు దూరమైతే గాని
అ అనుభవం నాకు దగ్గరకాలేదు.
ఎక్కడో ఉండే దూరం
ఇంత దగ్గరే ఉంటుందని
ఒక మధుర భావాన్ని పంచుతుందని
ఎన్నడూ అంత దూరం ఆలోచించలేదు నేస్తమా! 

బెదిరిన భావాలు

లొడలొడ వాగే నా నోట పదాలు కరువయ్యాయి
మదిని హాయిగొలిపే ఈ పూట భావాలు దూరమయ్యాయి
జలజల రాల్చే నా కలానికీ అక్షరాలు చిక్కలేదట
ఎదలో పలికే శ్రావ్యాలకూ స్వరాలూ పలకలేదట
ఆలోచనలు పారిపోతున్నాయి
మధురోహలు బెదిరిపోతున్నాయి
"ఎందుకురా మీరు ఇలా చేస్తున్నారు?" అనడిగితే......
నీ స్నేహాన్ని వర్ణించేంత చాతుర్యం వాటికి లేదట
అంత లోతుకి దిగేంత దైర్యమూ రాదట
బయటవున్న అవే అలా అంటే
మరి నిండా మునిగిన నేనేమనాలి నేస్తమా?

తియ్యని గాయాలు


పగిలిన హృదయం
రగిలిన గాయం
చెదిరిన కళలు
అలసిన ఆశలు
ఇవే నాకు మిగిలిన తలపులు
హుం! నేనంటే అంత అలుసా ప్రియతమా?
కంటి తలుపులు మూస్తె
ఆ చీకటి కూడా చీకొడుతుంది
బండబారుతున్న నా గుండెను చూస్తె
అది పెకలించి కన్నీరు పెడుతుంది.
లోలోన నెత్తుటి కణాలు ఉడికి లవాలై ప్రవహిస్తున్నాయి.
ఎన్ని బాధలు పెడుతున్న
ఎన్ని అవమానాలు ఎదురవుతున్న
ఇంకా నీపై ఉన్నా ప్రేమే వచ్చి వాటిని చల్లార్చి నయం చేస్తుంది.

తొలకరి

తుంపర్ల దుప్పటి కప్పిన సూర్యోదయ వేళ
లతిక లేత కిరణాలు నన్ను తట్టి లేపాయి
జలదరిస్తున్న చిరు చలి గిలిగింతలకు 
తనువంతా తుల్లింతై పరవశాన్ని నింపుకున్నాయి.
తొలకరి తొలి అడుగులకు చిగురాకు చివర్లను
ముద్దాడి నేలరాలిన చినుకుల తాకిడికి
పులకించిన పుడమితల్లి మట్టి వాసనల గుబాళింపును వెదజల్లుతుంటే
కరిగి పడుతున్న ఇసుక తిన్నెల కన్నీరుని చూసా
ఆవిరవుతున్న దూళి రేణువులకై వల వేసా.
పచ్చదనం పరచుకున్న పచ్చని కొండ కోనల నడుమ
వెల్లువిరిసిన హరివిల్లు సోయగాలపై వేలాడి
శ్యామవర్ణ మేఘాలపై తేలియాడి
ప్రకృతమ్మ ఒడిలో ఒదిగి ఉన్న అందాలను చూసి తరించి
వర్ణించటానికి ఈ ఒక్క కవితా చాలదని అర్ధం చేసకున్నాను.

Thursday, August 5, 2010

అలకామృతం

చెలికాడు అలక క్షణాలు ఎంతో మధురం
బ్రతిమిలాట ముచ్చట్లకున్న అనుభూతి అనుభవం మధురాతిమధురం
విరహాల మధ్య పెరిగే నిగ్రహ సంఘర్షణల సమరం
అవి కోప తాపాల తీపి భావాల వలపుల సంబరం
చిలిపి చూపుల చిరాకులో బిడియమెంత సుందరం
మధ్య మొదలయ్యే మౌన మోహనం మరింత మనోహరం
అహం అడ్డగించే అనుబంధానికై ఆరాటపు సత్వరం
గడియలు గడిచేకొద్దీ ఆ కలవర స్పర్శ్యలే ఒక ఆనందసాగరం
అది ఒక అమృత ప్రేమానుబంధం.

ప్రాణ నేస్తం

నాలో సగం నువ్వే అయినపుడు,
నా ప్రాణంలో సగం నీలోనే ఉంది కద నేస్తమా!
నను వీడి ఎక్కడికి వెళ్తావ్?
ఒంటరి వాడ్ని చేసి ఎంత దూరం పోతావ్?
నా ఊహకందని దృశ్యాన్ని నీ ఊహకు అందనివ్వకు.
అది తట్టుకుని తారసపడలేను, భరించి బ్రతకలేను.
అవసరమైతే ఆ మిగతా సగం కూడా నీకే ఇచెస్తా,
పూర్తిగా నా ఊపిరితోనే జీవించు.
అప్పుడు మనం ఎప్పటికీ విడిపోని ప్రాణ స్నేహితులమై ఉండిపోతాం.

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం