Friday, August 13, 2010

తొలకరి

తుంపర్ల దుప్పటి కప్పిన సూర్యోదయ వేళ
లతిక లేత కిరణాలు నన్ను తట్టి లేపాయి
జలదరిస్తున్న చిరు చలి గిలిగింతలకు 
తనువంతా తుల్లింతై పరవశాన్ని నింపుకున్నాయి.
తొలకరి తొలి అడుగులకు చిగురాకు చివర్లను
ముద్దాడి నేలరాలిన చినుకుల తాకిడికి
పులకించిన పుడమితల్లి మట్టి వాసనల గుబాళింపును వెదజల్లుతుంటే
కరిగి పడుతున్న ఇసుక తిన్నెల కన్నీరుని చూసా
ఆవిరవుతున్న దూళి రేణువులకై వల వేసా.
పచ్చదనం పరచుకున్న పచ్చని కొండ కోనల నడుమ
వెల్లువిరిసిన హరివిల్లు సోయగాలపై వేలాడి
శ్యామవర్ణ మేఘాలపై తేలియాడి
ప్రకృతమ్మ ఒడిలో ఒదిగి ఉన్న అందాలను చూసి తరించి
వర్ణించటానికి ఈ ఒక్క కవితా చాలదని అర్ధం చేసకున్నాను.

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం