ప్రేమించని వాడి బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా?
అందుకే నేనూ ప్రేమిస్తున్నాను.
ఆమె ప్రేమకు సాటే లేదు,
మరెవరి ప్రేమ పోటీ రాదు.
నా ఆనందమే తనకానందం అనేది,
ఏ హానీ జరగకూడదని కోరుకునేది.
తప్పు చేస్తే నాపై కసురుకునేది,
మాట వినకుంటె నన్ను కొట్టేది కూడా!
నేను అలిగి కన్నీరు పెడితే తన తియ్యని ముద్దుతో వాటిని కరిగించేది,
ఆమెనూ ముద్దాడమని చెక్కిలి చూపి నాపై ప్రేమను పెంచేది.
వనుకు పుడితే ఆమె కౌగిలి నాకు వసమయ్యేది,
నిదురోస్తే తన ఒడి నాకు సొంతమయ్యేది.
ఆమె చేతిని వదలకుండా పక్కనే చోటు ఇచ్చేది,
ప్రేమను తెలిపి గుండెలకు హత్తుకునేది.
తీరిక వేళల్లో నా చేతులను మెడ చుట్టూ పెనవేసుకుని కబుర్లు చెప్పేది,
నా సుఖదుఖాల్లో భాగాన్ని అడిగేది.
తప్పొప్పులు చూపి, మంచి చెడులు సూచించేది,
విజయ భాటలకై చెంత ఉండి నడిపించేది.
అల్లరి చేసినా ఆనందపడి నన్ను కడుపులో దాచుకుంది,
కోరినది ఇచ్చి ఇంత వాడిని చేసింది.
ఆ ప్రేమంతా అమృతమయం, లోతెరుగని కమ్మదనం.
అదే నా అమ్మ ప్రేమ.
అవును, అమ్మే నాకు ప్రేమ.
No comments:
Post a Comment